హైదరాబాద్: జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి జరుగుతుందని సినీ నటుడు మోహన్ బాబు అభిప్రాయపడ్డారు.వైసీపీలో చేరడానికి భయం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.ఈ పార్టీలో చేరడానికి ఎవరి అనుమతి తీసుకోవాలో చెప్పాలన్నారు.

మంగళవారం నాడు వైఎస్ జగన్ సమక్షంలో మోహన్ బాబు ఆయన  వైసీపీలో చేరారు.ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌పై ముఖ్యమంత్రితో అనేక సార్లు  మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు.  ఏ పదవిని కూడ ఆశించి తాను వైసీపీలో చేరలేదన్నారు. తెలుగు ప్రజల మంచి కోసమే తాను వైసీపీలో చేరినట్టుగా ఆయన ప్రకటించారు. 

జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి రోజులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. నేను ఏ పార్టీలో చేరాలనేది నా ఇష్టం, నా కుటుంబం ఇష్టమన్నారు. టీడీపీలో చంద్రబాబును అడిగి చేరానా అని ఆయన ప్రశ్నించారు.

నా ఆస్తులను తాకట్టు పెట్టి లెక్చరర్లకు జీతాలు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. అన్ని పార్టీలకు చెందిన తల్లిదండ్రుల ను పిలిపించి మాట్లాడినట్టుగా ఆయన తెలిపారు.

ఫీజు రీ ఎంబర్స్‌మెంట్స్ బకాయిలను తమ కాలేజీకి చెల్లించలేదన్నారు. మూడేళ్ల క్రితమే జగన్‌ పార్టీలో చేరాలని కోరినట్టుగా ఆయన గుర్తు చేశారు.ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ కింద తమ సంస్థకు రూ. 19 కోట్లు  ప్రభుత్వం బకాయి పడిందన్నారు.