అమరావతి: మాజీమంత్రి మృణాళినికి సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అమరావతిలో విజయనగరం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాజీమంత్రి మృణాళినిపై అసమ్మతి బట్టబయలైంది. 

నేతలు తిరుగుబాటుకు దిగారు. మృణాళినికి సీటివ్వొద్దు అంటూ నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ సర్పంచ్ లు, స్థానిక నేతలపై కేసులు పెట్టించిన మృణాళిని మాకొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానికులను పట్టించుకోని మృణాళినికి టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ నిరసన తెలిపారు. దీంతో టీడీపీ కో ఆర్డినేషన్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇకపోతే మాజీమంత్రి మృనాళిని సొంత జిల్లా శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఆమె పనిచేశారు. 

గతంలో ఆమె భర్త చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో ఆమె చీపురుపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత వైసీపీ నేత బొత్స సత్యనారాయణను ఓడించడంతో ఆమెకు చంద్రబాబు నాయుడు కేబినేట్ లో బెర్త్ దక్కింది. అయితే కేబినేట్ విస్తరణలో ఆమె పదవికి ఉద్వాసన పలికింది.