ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజ కవర్గం బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే సి.హెచ్‌. సత్యనారాయణమూర్తి(బాబ్జీ)కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాలం వేస్తున్నారు. ఆయన బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

తమ పార్టీలోకి రావాలంటూ రెండు నెలలుగా టీడీపీ, జనసేన, వైసీపీలు బాబ్జీని ఆహ్వానిస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వైసిపి ఆశ చూపింది. అయితే బాబ్జీ మాత్రం ఏమీ చెప్పడం లేదు. తాజాగా శుక్రవారం రాత్రి హోం మంత్రి చినరాజప్ప డాక్టర్‌ బాబ్జీతో చర్చలు జరిపారు. 

గంట పాటు ఆయనతో చినరాజప్ప సమావేశమయ్యారు. బాబ్జీ తనకు సన్నిహితుడని సీఎం చంద్రబాబు పంపగా మాట్లాడటానికి వచ్చానని భేటీ తర్వాత చినరాజప్ప మీడియాతో చెప్పారు. పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించామని తెలిపారు. పాలకొల్లు అసెంబ్లీ స్థానం ఇస్తారా.. లేదంటే నరసాపురం ఎంపీ టిక్కెట్‌ ఇస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. 

డాక్టర్‌ బాబ్జీ తన అభిప్రాయాన్ని ఇంకా వెల్లడించకుండానే ఎలా చెబుతామని చినరాజప్ప ఎదురు ప్రశ్న వేశారు. అయినా కూడా టిక్కెట్లు ఇచ్చేది, హామీ ఇచ్చేది తన చేతిలో లేదని, డాక్టర్‌ బాబ్జీ సానుకూలంగా స్పందిస్తే ఆ విషయం సీఎంకు చెబుతానని ాయన అన్నారు. అయితే ఆలోచిస్తానని డాక్టర్‌ బాబ్జీ చెప్పినట్టు ఆయన తెలిపారు.
 
హోం మంత్రి వచ్చి వెళ్లిన తరు వాత కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆయన ఇంటికి వెళ్లి ఒప్పించేందుకు మరో ప్రయత్నం చేశారు. ప్రజలకు బాబ్జీ సేవలు అవసరమని అందుకే పార్టీలోకి ఆహ్వానిం చేందుకు ఇంటికి వెళ్లామని కొత్తపల్లి సుబ్బారాయుడు మీడియాతో అన్నారు.
 
తాను బీజేపీలోనే కొనసాగుతున్నానని ఆ తర్వాత బాబ్జీ మీడియాతో అన్నారు. తనకు పలు పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నప్పటికీ ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేస్తారా అనిప్రశ్నించగా ఎంపీకి ఎవరు వెళ్తారని చిరునవ్వుతో బాబ్జీ సమాధానమిచ్చారు.