విశాఖపట్టణం: కేసీఆర్ కాళ్లు మొక్కే జగన్ కావాలో... రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నేను కావాలో తేల్చుకోవాలని  టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు.

ఆదివారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించారు.వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేశారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. 

రక్తపు మరకలను తుడిచేసిన తర్వాతే హత్య జరిగిందనే విషయాన్ని బయటకు తీసుకొచ్చారన్నారు. మీ ఇంట్లో హత్య జరిగితే మీకు తెలియదా అంటూ బాబు ప్రశ్నించారు.వైసీపీ, జగన్‌ను నమ్ముకొంటే జైలుకేనని ఆయన చెప్పారు.

టీడీపీకి ఓటేస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కష్టపడనున్నట్టు ఆయన  హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం కంటే అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతోందని ఆయన వివరించారు. కేసీఆర్ పిలుపునిస్తే 88 సీట్లలో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కంటే అభివృద్ధి చేసిన ఏపీలో ఇంకా ఎన్ని సిట్లలో టీడీపీని గెలిపించాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

జగన్‌ను గెలిపిస్తే తనను జైలుకు పోకుండా కాపాడాలని ప్రజలను కోరుతారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ను గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు మొక్కుతారన్నారు. అంతేకాదు తనకు పడిన ఓట్లను కేసీఆర్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి కేసులను మాఫీ చేసుకొంటారని బాబు ఆరోపించారు.

హైద్రాబాద్‌లో ఆంధ్రోళ్లు అంటూ అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉలవచారు అంటూ ఆత్మాభిమానం దెబ్బతినేలా అవహేళన చేస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆంధ్రుల పౌరుషాన్ని, నవ్యాంధ్ర రోషాన్ని చూపించాలని బాబు కోరారు.పోలవరంపై ఎందుకు కేసులు వేశారో కేసీఆర్ చెప్పాలన్నారు.

సముద్రంలో వృధాగా పోయే నీటిని వాడుకొనేందుకు ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధి కాకుండా తెలంగాణ అడ్డుపడుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెబితే కేసీఆర్ అడ్డుపడుతున్నాడని బాబు విమర్శించారు.