అమరావతి: ఏపీ  ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పోలింగ్ రోజున ముందస్తు ప్లాన్ ప్రకారంగా దాడులకు పాల్పడ్డారని ఆయన వైసీపీపై ఆరోపించారు. జన్మభూమిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే జనం రాష్ట్రానికి వచ్చారని చెప్పారు.

శుక్రవారం నాడు ఏపీ  సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. నిన్న చారిత్రక దినమన్నారు. తనపై నమ్మకంతో ఓటర్లు పెద్ద ఎత్తున  ఓటింగ్‌లో పాల్గొన్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనను అణగదొక్కితే ఏపీ రాష్ట్రాన్ని అణచివేయవచ్చనే ఆలోచనతో ఈ ముగ్గురు కుట్రలు పన్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. 

మోడీ, కేసీఆర్‌, జగన్‌లతో తాను పోరాటం చేయాల్సి వచ్చిందని చంద్రబాబునాయుడు చెప్పారు. అంతా కలిసి చేయాల్సిన కుట్రలన్నీ చేశారని చంద్రబాబునాయుడు విమర్శించారు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఈడీ,  సీబీఐ, తెలంగాణ పోలీసులు... ఇలా అందరినీ తమపై ప్రయోగించారని  బాబు ఆరోపించారు.

సంక్రాంతి సమయంలో తమ గ్రామాల్లో పండుగను జరుపుకొనేందుకు వచ్చారని... కానీ ఓటింగ్‌లో పాల్గొనేందుకు గాను ఓటర్లు ఇదే రకంగా స్పందించారని బాబు అభిప్రాయపడ్డారు. జన్మభూమిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఏపీకి వచ్చారని బాబు అభిప్రాయపడ్డారు.

దూర ప్రాంతాల నుండి ఓటింగ్‌లో పాల్గొనేందుకు జనం వచ్చారని ఆయన చెప్పారు. పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి  సుమారు 30 శాతం ఈవీఎంలు కూడ పనిచేయలేదన్నారు. పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు వీలుగా పకడ్బందీ ప్లాన్ చేశారని వైసీపీపై చంద్రబాబునాయుడు ఆరోపణలు చేశారు.

పోలింగ్‌కు ముందుగానే పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారని బాబు ఆరోపించారు.