ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. రాజమండ్రిలో సోమవారం నాడు ఎన్నికల సభలో పాల్గొంటున్నాననని చెబుతూ మోడీ టీడీపీపై విమర్శలు గుప్పించారు
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. రాజమండ్రిలో సోమవారం నాడు ఎన్నికల సభలో పాల్గొంటున్నాననని చెబుతూ మోడీ టీడీపీపై విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్‌గా చంద్రబాబునాయుడు స్పందించారు.
ఏపీ రాష్ట్రంలో తాను రెండవ ఎన్నికల సభలో రాజమండ్రిలో సోమవారం నాడు పాల్గొంటున్నట్టుగా ఇవాళ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కానున్నట్టుగా తాను విశ్వసిస్తున్నానని ఆయన ప్రకటించారు. బంధుప్రీతి, అవినీతిలో టీడీపీ పూర్తిగా కూరుకుపోయిందని ఆయన చెప్పారు. టీడీపీని తిరస్కరించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
మోడీ ట్వీట్‌కు చంద్రబాబునాయుడు కౌంటరిచ్చారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన హామీలను మోడీ విస్మరించారని బాబు దుయ్యబట్టారు.నల్లధనాన్ని దేశానికి తీసుకువస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఆర్థిక నేరస్తులు దేశం దాటేందుకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలను కుప్పకూలుస్తున్న మోడీకి వీడ్కోలు పలకేందుకు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు స్థిర నిర్ణయంతో ఉన్నారని బాబు అభిప్రాయపడ్డారు.
