ఏలూరు: ఏపీ రాష్ట్రంలో  తమ పార్టీ విజయం సాధిస్తోందని  టీడీపీ, వైసీపీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.  ఈ తరుణంలో  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి చెరువు  సిద్ధాంతి మరాటా చెబుతున్న జ్యోతిష్యం రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది.

కర్ణాటక రాష్ట్రంలోని దేవమ్మ తల్లి శక్తి  అనుగ్రహం ప్రకారంగా తాను  జ్యోతిష్యం చెబుతున్నట్టుగా ఆయన  వివరించారు.  12 ఏళ్లుగా తల్లి అనుగ్రహంతోనే జ్యోతిష్యం చెబుతున్న విషయాన్ని ఆయన  గుర్తు చేసుకొన్నారు.

ఈ నెల 11వ తేదీన ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అనుభవానికే ప్రజలు పట్టం కట్టే అవకాశం లేకపోలేదని జ్యోతిష్యుడు మరాఠా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ తెలుగు దినపత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది.

2012 ఎన్నికల్లో కూడ కిరణ్ కుమార్ సీఎం అవుతారని, 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మోడీ ప్రధానమంత్రి అవుతారని తాను చెప్పినట్టుగా జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ తాను చెప్పిన జోస్యం  కూడ నిజమైన విషయాలను ఆయన ప్రస్తావించారు.

పోలింగ్ ట్రెండ్ ఆధారంగా ఇప్పటికే రెండు పార్టీలు తామే విజయం సాధిస్తామని  ప్రకటించాయి. మహిళల ఓటింగ్ తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజలు కోపంతో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు వేశారని వైసీపీ నేతలు ధీమాతో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నిజమౌతాయా లేదా అనేది పక్కన పెడితే అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్య నిలబడి ఓటు చేసిన ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తారో.. ఆ పార్టీని తిరస్కరిస్తారోననే విషయం మే 23న తేలనుంది.జ్యోతిష్యాల గురించి నమ్మేవాళ్లు ఉంటారా... నమ్మని వాళ్లు కూడ ఉంటారు. అయితే ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి.