అమరావతి: సిట్టింగ్‌లపై ఉన్న అసమ్మతి కారణంగా రెండు రిజర్వ్ స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబునాయుడు మార్చారు.ఈ ఇద్దరు అభ్యర్థులను ఏకంగా జిల్లాలు మారి పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జాబితాలో మంత్రి జవహర్, పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఉన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా కోవూరు నుండి అనితకు చంద్రబాబునాయుడు టిక్కెట్టును కేటాయించారు.  ప్రస్తుతం అనిత విశాఖ జిల్లా పాయకరావుపేట నుండి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

గత ఎన్నికల్లో పాయకరావుపేట స్థానం నుండి  ఆమె టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ దఫా మరోసారి ఆమె ఇదే స్థానం నుండి పోటీ చేయాలని భావించారు. కానీ, స్థానికంగా అనితపై టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.

అనితకు బదులుగా మరోకరికి టిక్కెట్టు ఇవ్వాలని కోరారు.ఈ సమయంలో ఈ స్థానంలో  మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కూతురు పేరు కూడ తెరమీదికి వచ్చింది.  అయితే  చెంగల వెంకట్రావు కూతురు కంటే కేజీహెచ్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నా బంగారయ్య అయితే బాగుంటుందని టీడీపీ నాయకత్వం భావించింది. అనిత స్థానంలో  డాక్టర్ బంగారయ్యకు చంద్రబాబునాయుడు టిక్కెట్టును కేటాయించారు.అనితకు కోవూరు టిక్కెట్టును కేటాయించారు.

మరో వైపు పశ్చిమగోదావరి జిల్లాలోకి కోవూరు నుండి  ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసనలు చేశారు. జవహర్ బదులుగా మరోకరిని  బరిలోకి దింపాలని బాబును కోరారు. ఈ తరుణంలో జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరు అసెంబ్లీ స్థానానికి చంద్రబాబునాయుడు మార్చారు.

ఈ స్థానంలో మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ టిక్కెట్టు ఆశించారు. అయితే ఈ  స్థానంలో జవహర్‌కు టిక్కెట్టు కేటాయించారు. జవహర్‌కు టిక్కెట్టు కేటాయించడాన్ని స్వామిదాస్ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. అయితే  జవహర్‌కు సహకరిస్తామని స్వామిదాస్ ప్రకటించారు.