అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికారుల బదిలీపై అధికార తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతోంది. ఐపీఎస్ అధికారుల బదిలీ సరికాదని ఇదంతా ఒక కుట్ర పూరితంగా జరుగుతోందంటూ ఆరోపిస్తోంది టీడీపీ. 

ఇదే అంశంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ లేఖరాశారు. దాదాపు 7పేజీల లేఖను ఈసీకి రాశారు చంద్రబాబు. 

పోలీస్ ఉన్నతాధికారుల బదిలీల విషయంలో ఈసీ తీరును తప్పబడుతూ లేఖ రాశారు చంద్రబాబు. ఈసీ నిర్ణయం తెలిసి షాక్ కు గురైనట్లు తెలిపారు. సహజ న్యాయానికి విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. 

ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చెయ్యకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని లేఖలో ప్రశ్నించారు. బదిలీల విషయం ప్రభుత్వానికి తెలపకపోవడం బాధాకరమని లేఖలో పొందుపరిచారు చంద్రబాబు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా ఈసీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

ఈ లేఖ తీసుకుని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, జూపూడి ప్రభాకర్ లు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే బదిలీల వ్యవహరంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. 

ఇకపోతే ఈసీ తీసుకున్న చర్యలు కేవలం కంటితుడుపు చర్యలు మాత్రమేనని వైసీపీ స్పష్టం చేస్తోంది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్, కీలక ప్రభుత్వ అధికారులు ఘట్టమనేని శ్రీనివాసరావు, ఓఎస్ డీ యోగానంద్, విక్రాంత్ పాటిల్ తోపాటు మరికొంతమందిపై తాము ఫిర్యాదు చేశామని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ.