అమరావతి: చంద్రగిరిలో రీపోలింగ్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అడిగిన బూత్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అడిగిన 7 బూత్‌లలో 5 బూత్‌లకు రీపోలింగ్ నిర్వహించడం సరి కాదని చంద్రబాబు అన్నారు. టీడీపీ అడిగిన స్థానాల్లోనూ రీపోలింగ్‌ జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ద్వారా ఈసీ పక్షపాత ధోరణి మరోసారి రుజువైందని ఆయన అన్నారు. రీపోలింగ్‌పై గురువారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, విభజన సమస్యలను పట్టుదలతో అధిగమిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రవాసాంధ్రులతో సమావేశమైన ఆయన 13జిల్లాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. డిజిటల్ క్లాస్ రూమ్ లు అభివృద్ది చేశామని, రూ.5వేల కోట్లతో స్కూల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచామని చెప్పారు. 

విదేశాలనుంచి పెట్టుబడులు రాబట్టామని, పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.300 ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పామని, నాలెడ్జ్ ఎకానమిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేశామని అన్నారు. అందువల్లే రైతుబిడ్డలు ఇంజనీర్లుగా విదేశాల్లో స్థిరపడ్డారని అన్నారు. 150 దేశాల్లో 25 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారని చెప్పారు.