అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నేమ్ ప్లేట్ ను అధికారులు తొలగించారు. అంతేకాకుండా, ఆయన ఫొటోలను కూడా తొలగించారు మంత్రుల నేమ్ ప్లేట్స్ తొలగించాలని సాధారణ పరిపాలనా శాఖ (జిఎడి) ఆదేశాలు జారీ చేసింది. దాంతో వారి నేమ్ ప్లేట్లను తొలగించారు. 

ఇదిలావుంటే, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి వేదికను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని తొలుత అనుకున్నారు. అయితే, దానివల్ల విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో మరో వేదిక కోసం పరిశీలిస్తున్నారు.

చినఅవుటుపల్లిలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎదుట గల స్థలాన్ని అందుకు పోలీసులు పరిశీలిస్తున్నారు. కనీసం 20 ఎకరాల ఖాళీస్థలం ఉండేలా చూస్తున్నారు. అది చెన్నై - కోల్ కతా హైవేపై ఉంది. అక్కడ ఏర్పాట్లు చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని భావిస్తున్నారు. 

జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 5 లక్షల నుంచి 7 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.