శ్రీకాకుళం: తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. శనివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు కేసీఆర్ నువ్వు బాహుబలి అయితే.. నేను మహా బాహుబలిని అంటూ హెచ్చరించారు. 

కేసీఆర్‌ని బలపరుస్తారా?.. మోదీకి ఓటేస్తారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అంతా ఒక్కటైతే మనం తక్కువా అంటూ నిలదీశారు. కేసీఆర్ నువ్వు16 సీట్లు గెలిస్తే నేను 25 సీట్లు గెలుస్తా అంటూ చెప్పుకొచ్చారు. జన్మభూమికి ద్రోహం చేసేవాళ్లు మనకు అవసరంలేదన్నారు చంద్రబాబు. 

తాను పిరికిపందను కాదని అవసరమైతే జాతికోసం ప్రాణాలిస్తానన్నారు. ఆంధ్రుల జోలికి వస్తే అడ్రస్‌ గల్లంతు చేస్తామని హెచ్చరించారు చంద్రబాబు. సైకిల్‌ చైన్‌ను కేసీఆర్‌ తెంపేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. 

నా సైకిల్‌ చైన్‌ దగ్గరికి వస్తే షాక్‌ కొట్టి అక్కడే ఫినిష్‌ అవుతారని హెచ్చరించారు. ఇది మామూలు సైకిల్‌ కాదని ఎంతదూరమైనా వెళ్తోందన్నారు. సైకిల్ స్పీడ్‌ కూడా పెంచుతామని తెలిపారు. ఎంతమంది అవినీతి పరులొచ్చినా ముందుకెళ్తామని స్పష్టం చఏశారు. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. రాజధాని శంకుస్థాపనకు మోదీ ఇచ్చిన మట్టి, నీళ్లు ఆయన ముఖానే కొడతామన్నారు. ఏడాదికి రూ.6 వేల కోట్లు పన్నుల రూపంలో కడితే కేసీఆర్‌ రూ.500 కోట్లు మనకు ఇస్తాడంట అంటూ చెప్పుకొచ్చారు. 

ఎవడికి కావాలి మీ డబ్బు. ఏపీకి రావాల్సిన లక్ష కోట్లు ఇచ్చి మాట్లాడాలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు చంద్రబాబు. అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్‌ ఎత్తిపోతుందని కేసీఆర్‌ భయమన్నారు. అందుకే జగన్‌కు మద్దతిస్తున్నాడని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

చంద్రన్న భీమాను రూ. 10 లక్షలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. డ్రైవర్ల కుటుంబాలను ఆదుకుంటానన్నారు. పొలంలో మోటార్‌కు ఒక యాప్‌ ఏర్పాటు చేసి ఇంట్లో నుంచే ఫోన్ తో మోటార్ ను ఆన్ చేసుకునేలా రూపొందిస్తాననని హామీ ఇచ్చారు. 

కేసీఆర్‌, మోదీ కలిసి కోడికత్తి పార్టీని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ జుట్టు మోదీ చేతుల్లో పిలక కేసీఆర్‌ చేతుల్లో ఉందన్నారు. రాజాం నియోజకవర్గంలో రూ.150 కోట్లతో ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. 

పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని సీఎం భరోసా ఇచ్చారు. పింఛను పెంపుతో పదింతల భరోసా కల్పించానని, కోటి మంది చెల్లెమ్మలకు పసుపు-కుంకుమ ఇచ్చానని చెప్పుకొచ్చారు. నిరుద్యోగ భృతిని రూ.3వేలకు పెంచుతానని ప్రకటించారు.