అమరావతి: కేసీఆర్ వ్యవహారశైలిని మార్చుకోకపోతే హైద్రాబాద్‌లో ఆందోళన చేస్తామని టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుహెచ్చరించారు.ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు కేసీఆర్ తీరును విమర్శిస్తున్నవిషయం తెలిసిందే.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం నాడు టీడీపీ నేతలతో  టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్పరెన్స్‌లో జగన్, కేసీఆర్‌లపై విరుచుకుపడ్డారు. టీడీపీ అభ్యర్థులను టీఆర్ఎస్‌ బెదిరిస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. కేసీఆర్ సహకారంతో వైసీపీ విర్రవీగుతోందన్నారు.

హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కేసీఆర్ దెబ్బతీస్తున్నాడని చంద్రబాబునాయుడు విమర్శించాడు. రాష్ట్రానికి జగనే పెద్ద సమస్య అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఫాం-7 ధరఖాస్తులు చేశారని చెప్పారు.

తప్పుడు విధానాలతో గెలిచేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. టీడీపీ బూత్ కన్వీనర్లను ప్రలోభాలకు గురి చేసేవాడని ఆయన ఆరోపించారు.

జగన్‌ను అడ్డు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ను దోచుకోవాలని చూస్తున్న కేసీఆర్‌కు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని చంద్రబాబునాయుడు కోరారు.జగన్ నేరస్తుడిగా కాకుండా రాజకీయ నేతగా చలామణి అవుతున్నాడని ఆయన చెప్పారు.