అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో జగన్ తప్పుమీద తప్పు చేస్తున్నారంటూ ఆరోపించారు. 

ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు సంబంధించిన మరిన్ని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. గురువారం ఉదయం పార్టీనేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ డమ్మీ అంటూ వ్యాఖ్యానించారు. 

టీఆర్ఎస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ అవినీతిని ఆసరాగా చేసుకుని ప్రధాని మోదీ, కేసీఆర్ లు ఏపీలో కుట్రలు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైఎస్  జగన్ దాసోహం అయ్యారంటూ విరుచుకుపడ్డారు. 

మోదీ, కేసీఆర్ ల చేతిలో జగన్ ఓ ఆటబొమ్మగా మారారంటూ విరుచుకుపడ్డారు. మోదీ, కేసీఆర్, వైఎస్ జగన్ ల ములాఖత్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ల సంబంధాలు ఆధారాలతో సహా బయటపడిందని వ్యాఖ్యానించారు. ఈ 26 రోజులూ రేయింబవళ్లు కష్టపడి పార్టీ అఖండ విజయానికి కృషి చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.