ఒంగోలు: ఒంగోలు పార్లమెంట్‌ వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు. మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీకి తనకు నమ్మక ద్రోహం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మాగుంట ఎందుకు నమ్మకం ద్రోహం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పిరికితనంతో టీడీపీని వీడావా, లేక కుల పిచ్చితో నమ్మక ద్రోహం చేశావా అంటూ మండిపడ్డారు. పిరికితనంతో పారిపోతే ఇంట్లో పడుకోకుండా ఎందుకు పోటీ చేస్తున్నావంటూ నిలదీశారు. 

ఓటుకు వచ్చేటప్పుడు మాగుంటను ప్రశ్నించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ లోక్‌సభ అభ్యర్థి శిద్ధా రాఘవరావు కష్టపడి దర్శిని నాలుగైదు వేల కోట్లతో అభివృద్ధి చేశారని చెప్పారు. 

శిద్ధా దర్శిలోనే పోటీ చేయాలనుకున్నారని, మాగుంట చేసిన నమ్మక ద్రోహంతో అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆస్తులను అడ్డుపెట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్‌ బెదిరిస్తున్నారని ఆరోపించారు. 

ఎమ్మెల్యే అభ్యర్థుల భూములకు లిటిగేషన్‌ పెడుతున్నారని, రేపు విత్‌డ్రాలు చేయమని ఒత్తిడి తెస్తారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయాలు ఎంతగా కంపు కొడుతున్నాయంటే భర్త ఒక పార్టీ భార్య మరో పార్టీలో ఉన్నారు. 

ముసుగు రాజకీయాలు వద్దు అంటూ పురంధీశ్వరిపై సెటైర్ వేశారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్‌ ఉంటుంది కానీ స్విచ్ మాత్రం హైదరాబాద్‌లో  ఉంటుంది కరెంట్ మాత్రం ఢిల్లీలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ గడ్డపై పుట్టిన వాళ్లు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించకుండా జగన్‌ లోటస్‌పాండ్‌లో కూర్చొని బాంచన్‌ కాల్మొక్తా అంటూ కేసీఆర్ కు సరెండర్ అయిపోయారంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు.