ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు కార్యకర్త స్థాయి నుంచి సీఎం వరకు ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

ఎన్నికల వ్యూహ, ప్రతివ్యూహాల్లో సిద్ధహస్తులైన వీరిద్దరు ఒకప్పుడు జనరల్ ఏజెంట్లుగా పనిచేశారు. 1993లో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్. పాలకొండ్రాయుడు, కాంగ్రెస్ నుంచి మండిపల్లె నారాయణ రెడ్డి బరిలో నిలిచారు.

అప్పటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో చంద్రబాబు, వైఎస్‌లు రాయచోటిలోనే మకాం వేశారు. పోలింగ్ రోజున టీడీపీ తరపున చంద్రబాబు, కాంగ్రెస్ తరపున వైఎస్ జనరల్ ఏజెంట్‌గా పనిచేశారు.

ఈ క్రమంలో స్థానిక డైట్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా రాజశేఖర్ రెడ్డి ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు.

సున్నిత ప్రాంతం, ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రంగా కావడంతో పాటు ఇద్దరు అగ్రనేతలు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయేమోనని నాయకులు, కార్యకర్తలు, పోలీసులు భయపడ్డారు. అయితే ఇద్దరు ఒకర్నొకరు పలకరించుకుంటూ.. నవ్వుతు బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.