అమరావతి: ఎన్నికల్లో ఓటింగు సరళిపై, అభ్యర్థుల విజయావకాశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల పట్ల పార్టీ నాయకులు ఆసక్తి ప్రదర్శించడం లేదు. సమావేశాలకు పార్టీ నేతలు హాజరు కాకపోవడంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడుతున్నారు. 

సమావేశాలకు హాజరు కాకపోవడమే కాకుండా నివేదికలు కూడా సమర్పించకపోవడంపై చంద్రబాబు పార్టీ నేతలపై సీరియస్ అవుతున్నారు. బుత్ స్థాయిలో ఓటింగు సరళిపై, ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి విజయావకాశాలపై నివేదిక సమర్పించాలని టీడీపీ అధినాయకత్వం ఆదేశించింది.

ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం వల్ల లాభం లేదని టీడీపి నాయకులు భావిస్తున్నారు. ఫలితాల వెల్లడి తర్వాత సమావేశాలు ఏర్పాటు చేస్తే క్రాస్ ఓటింగుపై, కోవర్టు చర్యలపై, పార్టీ అపజయానికి గల ఇతర కారణాలపై స్పష్టమైన చిత్రం వస్తుందని వారు భావిస్తున్నారు. 

ఇటీవల చంద్రబాబు నాయుడు రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంపై, ఆ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్ష నిర్వహించారు. తూర్పూ గోదావరి జిల్లా నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రావు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని, వైసిపితో కుమ్మక్కయ్యారని అనపర్తి నియోజకవర్గం టీడీపీ నేతలు ఆరోపించారు. రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్  రాజనీ శేష సాయి టీడీపికి వ్యతిరేకంగా పనిచేశారని మరో నేత ఆదిరెడ్డి అప్పారావు ఆరోపించారు. 

జనసేన అభ్యర్థులు వైసిపి ఓట్లను చీలుస్తారని తమ పార్టీ నాయకులు భావించారని, అయితే వారు వాస్తవంగా టీడీపి ఓట్లను చీల్చారని కొవ్వూరు నాయకులు చెప్పారు. అక్రమ ఇసుక తవ్వకం, రవాణా వంటివి పార్టీ అభ్యర్థులపై తీవ్రమైన ప్రభావం చూపాయని అభిప్రాయపడ్డారు. 

శ్రీకాకుళం శాసనసభ్యురాలు జి. లక్ష్మీదేవిపై, ఇతర నాయకులపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. తండ్రి మరణం వల్ల లక్ష్మీదేవి సమావేశానికి రాలేకపోయారని, అయితే నివేదికలతో ఇతర నాయకులను సమావేశానికి పంపించాల్సి ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో 150 స్థానాలు గెలుస్తామని భావించిన చంద్రబాబు ఇప్పుడు 110 స్థానాలను గెలుస్తామనే ధీమాతో ఉన్నట్లు చెబుతున్నారు. 

ఎన్నికల సమయంలో చేదు అనుభవాలను ఎదుర్కున్న నాయకులు వాస్తవాలను చెప్పడం ద్వారా చంద్రబాబు ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందనే ఉద్దేశంతో సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబును మెప్పించడానికి తమ అభ్యర్థులు గెలుస్తారని కొంత మంది నాయకులు నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు.