హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ ఢిల్లీలో ప్రధానిని నిర్ణయించేది తానేనని పదేపదే చెప్పుకున్న చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చాయి ఏపీ ఎన్నికలు. కేంద్రంలో కాదు కదా అసలు ఏపీలోనే ఆ అవకాశం ఇవ్వకుండా తీర్పు ఇచ్చారు ఏపీ ప్రజలు. 

ఈ ఎన్నికలు చంద్రబాబు ఆశలను ఆడియాశలు చేశాయి. మరోసారి ముఖ్యమంత్రి అవుదామని కలలుగన్న చంద్రబాబు కలలను పగటి కలలుగానే మిగిల్చాయి. అంతేకాదు ఢిల్లీని శాసిద్దామంటూ ఢిల్లీ చుట్టే చక్కర్లు కొట్టిన చంద్రబాబుకు ఆ ఆశలు కూడా నెరవేరలేదు. 

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించే దిశగా పయనిస్తోంది. యూపీఏ కూటమి ఏర్పాటు అంటూ దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేస్తున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల ఫలితాలు మింగుడుపడటం లేదు. 

ఇప్పటి వరకు సీఎంగా, రాజకీయ సీనియర్ నేతను అంటూ చెప్పుకుని తిరిగే చంద్రబాబు ఘోర ఓటమి తర్వాత ఎలా దేశరాజకీయాలవైపు పయనిస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం టీడీపీ ఎదురుగాలే వీస్తోంది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తోంది. కేంద్రంలో టీడీపీ ప్రాతినిధ్యం ఉండాలంటే కనీసం తన పార్టీ తరపున 10 మంది ఎంపీలు అయినా గెలిచి ఉంటే బాగుండేదని ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది బీజేపీ. 

అయితే ఇలాంటి పరిస్థితుల్లో యూపీఏ కూటమి అంటూ హడావిడి చెయ్యాల్సిన అవసరం లేదు. దీంతో యూపీఏ కూటమిలో కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పాలన్న చంద్రబాబుకు ఆశలు గల్లంతయ్యాయి. 

తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానున్న నేపథ్యంలో చంద్రబాబు పరిస్తితి గడ్డుకాలమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో బీజేపీపైనా, ఎన్డీఏ ప్రభుత్వంపైనా ఆయన చేసిన విమర్శలే అందుకు కారణమని ప్రచారం జరుగుతోంది.  

ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలు మాత్రం చంద్రబాబును కోలుకోలేని దెబ్బతీశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ చంద్రబాబు అడ్రస్ లేకుండా చేసేశాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.