Asianet News TeluguAsianet News Telugu

మోదీకి రిప్లై... వరస ట్వీట్లతో విరుచుకుపడ్డ చంద్రబాబు

ప్రధాని నరంద్రమోదీపై.. ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు.  ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీని ప్రజలు తిరస్కరించడం ఖాయమని చంద్రబాబు అన్నారు. 

Chandrababu continues tweets on PM narendra modi, and gave strong reply
Author
Hyderabad, First Published May 11, 2019, 11:12 AM IST

ప్రధాని నరంద్రమోదీపై.. ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు.  ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీని ప్రజలు తిరస్కరించడం ఖాయమని చంద్రబాబు అన్నారు. అంపైర్లనే తప్పు పడుతున్నారంటూ.. ఇటీవల మోదీ.. ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా... మోదీ కామెంట్స్ కి బాబు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా.. ఘాటుగా స్పందించారు.

‘‘మే 23న దేశ ప్రజలు ప్రధానిగా @narendramodi, అతని టీమ్‌ను తిరస్కరించడం ఖాయం. అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్‌నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ టీమ్‌కు పరాజయం ఖాయం. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్‌ను ప్రజలే ఎంపిక చేసుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు.’’ అని చంద్రబాబు అన్నారు.

‘‘మా పోరాటం భారత ఎన్నికల సంఘంపై కాదు. మా పోరాటం అధికారుల వివక్షతపై, పక్షపాత ధోరణిపైనే. @narendramodi, @AmitShahలపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఈసీ అమలు చేయకపోవడంపైనే మా పోరాటం.’’ అని చంద్రబాబు తెలిపారు.

‘‘ ఎన్నికల షెడ్యూల్‌కు 73 రోజులు తీసుకున్న ఈసికి 50% వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం..? నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారు..? 50% వీవీ ప్యాట్‌లు లెక్కించాలని ఈసిని ప్రతిపక్షాలు అడిగితే మోదీకి ఏం సంబంధం, ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు..?’’ అని మోదీని చంద్రబాబు ప్రశ్నించారు.

‘‘రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా @narendramodi వెనుకాడరు. రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన మాకు నీతిపన్నాలు ప్రబోధిస్తారు.’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios