టీడీపీ తరపునుంచి ఈ వచ్చే ఎన్నికల్లో ఓ మాజీ కలెక్టర్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ స్థానానికి మాజీ కలెక్టర్ రామాంజనేయులుకి టికెట్ కేటాయించారు. కాగా.. ఆయన గుంటూరు జిల్లాకి గతంలో కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు.

అధిష్ఠానం ప్రకటించిన రెండో జాబితాలో రామాంజనేయులుకు టిక్కెట్‌ ఖరారు చేశారు. ఆయన తాడికొండ, ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానాలు, బాపట్ల, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి ఎక్కడైనా పోటీచేసేందుకు యత్నించారు. అయితే, టీడీపీ అధిష్ఠానం రామాంజనేయులు సొంత జిల్లా కర్నూలులోని కోడుమూరు అసెంబ్లీ టిక్కెట్‌ను ఖరారు చేసింది. సీఎం చంద్రబాబు మంగళవారం కర్నూలు ఎన్నికల సభలో రామాంజనేయులును పరిచయం చేశారు.
 
రామాంజనేయులు గుంటూరు జిల్లా కలెక్టర్‌గా 2009- 2012 వరకు పనిచేశారు. విభజన తరువాత వెలగపూడి కేంద్రంగా నవ్యాంధ్రలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా కొనసాగారు. మంత్రి నారా లోకేశ్‌తో రామాంజనేయులుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.