విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు ఉండగా..శుక్రవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.  టీడీపీ నాయకులపై ఐటీ దాడులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రమంతా అట్టుడికి పోవాలంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏమరుపాటుగా ఉంటే ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

పోలింగ్‌ రోజు వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోవద్దని, తిరగబడాలని సూచించారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని మేధావులు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. 

అధినేత పిలుపుకు స్పందించి తెలుగు తమ్ముళ్లు ఎటువంటి ఆందోళనలకు దిగుతారోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే చంద్రబాబు వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ఎలా పరిగణిస్తుందో వేచి చూడాలి.