ఈ ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మరికొన్ని గంటల్లో ఇటీవల జరిగిన ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు... తమ పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. అక్కడి నుంచే టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘‘2014 ఎగ్జిట్ పోల్స్‌లో కొన్ని జాతీయ చానళ్లు వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. అయినా మనమే గెలిచాం. ఇప్పుడు కూడా కొన్ని చానళ్లు అలా చెప్పే అవకాశం ఉంది. వారి అంచనాలు మళ్లీ తప్పు అవుతాయి. ఏపీలో నూటికి వెయ్యి శాతం టీడీపీదే గెలుపు’’ అని పార్టీ నేతలతో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేశారు.

 తాను ప్రధాని పదవి రేసులో లేనని చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కృషి చేస్తున్నానని అన్నారు. కేంద్రంలో ఒకప్పుడు ఎన్టీఆర్ పాత్రను.. ఇప్పుడు తాను నిర్వహిస్తున్నానని చెప్పారు. దేశం బాగుపడాలనే ఉద్దేశ్యంతోనే నిస్వార్థంగా పనిచేస్తున్నానని అన్నారు.