విజయవాడ: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకు నేడే ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మినారాయణ ఉదయం పది గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారని, ఈ సందర్భంగా ఆయన పార్టీలో చేరుతారని చెబుతున్నారు.

లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. టీడీపిలో చేరి భిమిలీ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు కూడా వచ్చాయి. ఆయనను టీడీపిలోకి రప్పించేందుకు మంత్రి గంటా శ్రీనివాస రావు తీవ్రంగానే కృషి చేశారు.

లక్ష్మినారాయణ టీడీపిలో చేరుతారనే వార్తలు రాగానే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పార్టీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తును ప్రస్తావిస్తూ చంద్రబాబుకు, లక్ష్మినారాయణకు ఉన్న బంధం బయటపడిందని వ్యాఖ్యానించాయి.

జగన్ అక్రమాస్తుల కేసును లక్ష్మినారాయణ నేతృత్వంలోని సిబిఐ బృందం దర్యాప్తు చేసింది. అంతేకాకుండా జగన్ ను అరెస్టు చేసింది కూడా ఆయనే. చంద్రబాబు ప్రోద్బలంతోనే జగన్ పై లక్ష్మినారాయణ అతిగా వ్యవహరించారని వైసిపి నాయకులు ఆరోపించారు. 

ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీలో చేరితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయంతో లక్ష్మినారాయణ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరాలని నిర్ణయించుకున్టన్లు చెబుతున్నారు.