మాజీ మంత్రి,వైసీపీ అధినేత జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత లక్ష్మీ నారాయణ తెలిపారు.

ఇటీవల లక్ష్మీనారాయణ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఈ  ఎన్నికల బరిలో కూడా ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ పార్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. వివేకా వ్యక్తిత్త్వం చాలా మంచిదని ఆయన పేర్కొన్నారు.

లక్ష్మీనారాయణకు, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు బంధుత్వాన్ని అంటగడుతూ.. అప్పట్లో వివేకానంద రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివేకా తనకు ఫోన్ చేసి... ‘‘బాబూ తప్పైంది.. వేరే వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అలా మాట్లాడాను. ఆఫీసుకు వచ్చి క్షమాపణలు చెబుతాను’’ అన్నారని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. 

ఎవరో చెప్పినది విని అలా రియాక్ట్ అయ్యుంటారని.. కాబట్టి దీన్ని అంత సీరియస్‌గా తీసుకోనవసరం లేదని తాను వివేకాతో చెప్పానన్నారు. ఆయన ఆలోచన తీరు అలా ఉంటుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా తనకు ఎలాంటి సబంధం లేదని తెలిపారు. తిత్లీ తుఫాను సమయంలోనే చంద్రబాబును తొలిసారి కలుసుకున్నా అన్నారు.