నరసరావుపేట అసెంబ్లీ స్థానం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబుపై కేసు నమోదైంది. నిర్లక్ష్యంగా వైద్యం చేసి తన తల్లి మృతికి కారణమయ్యారంటూ ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామానికి చెందిన పంపనాతి చిన్నయోగమ్మ అనే వృద్ధురాలు గతేడాది నవంబర్‌ 6న ఇంట్లో జారిపడటంతో ఆమె ఎడమకాలు విరిగింది.

దీంతో కుటుంబసభ్యులు చిన్నయోగమ్మను నరసరావుపేటలో డాక్టర్ అరవింద్ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న అమూల్య నర్సింగ్ హోంలో చేర్పించారు.  అక్కడ పరీక్షలు నిర్వహించిన అరవింద్ బాబు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు.

ఇంటికి వెళ్లిన మరుసటి రోజే కాలు నల్లగా మారడంతో మరోసారి కుటుంబసభ్యులు అరవిందబాబు దగ్గరకి వచ్చి చూపించారు. దీనికాయన క్రమంగా తగ్గుతుందని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంటికి పంపించి వేశారు.

అయితే కాలుకు ఎలాంటి స్పర్శ లేకపోవడాన్ని గమనించిన చినయోగమ్మ మనవడు దీనిని గమనించి అరవింద్ బాబును నిలదీయగా ఆయన దురుసుగా ప్రవర్తించారని కుటుంబసభ్యులు తెలిపారు.

దీంతో ఆయనపై రెండు నెలల క్రితమే నరసరావుపుట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం చిన్నయోగమ్మను మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కాలు తొలగిస్తేనే ఆమె బ్రతుకుతుందని తెలిపారు.

ఈ క్రమంలో చిన్నయోగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూసింది. దీనిపై మృతురాలి కుమారుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.