అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి హత్య కేసులో 19 వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో 11 మంది డీఎస్పీ ఎదుట ఆదివారం లొంగిపోయారు.

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా ఏప్రిల్ 11న వీరాపురంలోని 197వ పోలింగ్ బూత్‌లో తాడిపత్రికి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు వీరాపురంలో నమోదు చేసుకున్న ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు.

అయితే తాడిపత్రికి చెందిన మీరు ఇక్కడ ఓట్లు వేస్తారంటూ వైసీపీ ఏజెంట్లు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన టీడీపీ నేత పోలింగ్ బూత్‌లోకి వచ్చాడు.

అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా బూత్‌లోకి వచ్చారు. ఇదరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్ భారికేడ్లను విరగ్గొట్టి కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఈ ఘటనలో భాస్కర్‌రెడ్డితో పాటు వైసీపీ నేతలు పుల్లారెడ్డి, సూర్యనారాయణ, సునీల్, హరిబాబు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ భాస్కర్ రెడ్డి మరణించగా, వైసీపీ కార్యకర్తలను మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. ఈ ఘటనతో అధికారులు రెండు గంటల పాటు పోలింగ్ నిలిపివేశారు.