కర్నూలు: మొన్నటి వరకు తెలంగాణలోనే ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆంధ్రవాళ్లు అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కల్యాణ్ తెలంగాణపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

సిబిఐ మాజీ జేడీ లక్ష్మినారాయణతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్థరాత్రి చర్చలు జరిపారని సి. రామచంద్రయ్య శనివారం మీడియా సమావేశంలో అన్నారు. నారా లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ మంగళగిరిలో జనసేన అభ్యర్థిని ఎందుకు పోటీకి దింపలేదని ఆయన అడిగారు. 

తెలుగుదేశం పార్టీకి జనసేన బీ టీమ్ లా పనిచేస్తోందని, పవన్ కల్యాణ్ చంద్రబాబు డూపులా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంగళగిరిలో బూములు మింగిసేనవారికి మద్దతు ఇస్తారా అని పవన్ కల్యాణ్ ను ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా వైసిపి మీదనే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీడీపి శ్రేణులు పాల్గొనడమే టీడీపితో జనసేన కలిసి పనిచేస్తోందని చెప్పడానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు చెప్పిందే చేసినప్పుడు పవన్ కల్యాణ్ కు సొంత పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. పవన్ ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, తెలంగాణలో ఆంధ్రవాళ్లపై ఎప్పుడు దాడులు జరిగాయో పవన్ కల్యాణ్ చెప్పాలని ఆయన అన్నారు. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడని ఆయన అన్నారు.