Asianet News TeluguAsianet News Telugu

అమ్ముడు పోవడమే పవన్ కల్యాణ్ పౌరుషమా: సీఆర్ ఘాటు వ్యాఖ్యలు

మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన అధికారపార్టీని వదిలి ప్రతిపక్షాన్ని విమర్శించడం దారుణమని విమర్శించారు. పవన్‌ను నమ్మి పార్టీలో చేరినవారు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆరు నెలల కిందట చంద్రబాబు,లోకేష్‌ల అవినీతిపై మాట్లాడిన పవన్‌ ప్రస్తుతం ప్రతిపక్షంపై విమర్శలు చేయడం దారుణమన్నారు.

C Ramachandraiah questions Pawan Kalyan
Author
Vijayawada, First Published Apr 2, 2019, 5:49 PM IST

విజయవాడ : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య. ప్యాకేజీకి అమ్ముడుపోవడమే పవన్ కళ్యాణ్ పౌరుషమా అంటూ ప్రశ్నించారు. 

మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన అధికారపార్టీని వదిలి ప్రతిపక్షాన్ని విమర్శించడం దారుణమని విమర్శించారు. పవన్‌ను నమ్మి పార్టీలో చేరినవారు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 

ఆరు నెలల కిందట చంద్రబాబు,లోకేష్‌ల అవినీతిపై మాట్లాడిన పవన్‌ ప్రస్తుతం ప్రతిపక్షంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్యాకేజీలు పవన్‌ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చాయని తెలిపారు. 

చంద్రబాబుతో లాలూచీ పడటమే పౌరుషమా అని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్‌ వస్తుందని ప్రజలను భయపెడుతున్నారని 2004లో కూడా వైఎస్సార్‌పై ఇలానే దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. కానీ వైఎస్‌ అధికారంలోకి వచ్చాక సంక్షేమ రాజ్యాన్ని ప్రజలకు అందించారని గుర్తుచేశారు. 

వైఎస్‌ వచ్చాకే రైతుల కష్టాలు తొలగిపోయాయని స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు జగన్‌ అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్‌ వస్తుందని ప్రజలను భయపెడుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు లాంటి వ్యక్తి మళ్లీ సీఎం అయితే రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిపోతుందన్నారు. 

కేసీఆర్‌పై విమర్శలు చేసే చంద్రబాబు ఎందుకు తెలంగాణలో పోటీ చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ కార్యాలయం బోసిపోయిందని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్‌ నుంచి అమరావతికి పారిపోయి వచ్చి అక్కడ టీడీపీని చాపచుట్టేలా చేశారని సి.రామచంద్రయ్య విమర్శించారు. 

టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్‌ కూడా అస్థిత్వం కోల్పోయిందని విమర్శించారు. డిలిమినేషన్‌ కోసం కేంద్రంతో తగాదా పెట్టుకున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆరోపించారు. పొరుగు రాష్ట్రం, కేంద్రంతో తగాదా పెట్టుకుంటే ఏపీ ఎలా అభివృద్ది చెందుతుందని ప్రశ్నించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios