అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ సీఎం కావాలనే కల కలగానే మిగిలిపోతుందని అది నెరవేరదని స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నాం తన అనుచరులతో కలిసి అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. 

త్వరలోనే తాను టీడీపీలో చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ కు ఓటేస్తే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోతుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడని, ఆయనే మళ్లీ సీఎం కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. 

తాను ఎక్కడ ఉన్నా రాయలసీమ హక్కుల కోసం పోరాడతానని స్పష్టంచేశారు. చంద్రబాబు ఆదేశిస్తే శ్రీశైలం నుంచి పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు.