ఎవరు ఏం చెప్పినా... ఏపీలో విజయం సాధించేది మాత్రం కచ్చితంగా టీడీపీనేనని  ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సంగతి తెలిసిందే. కాగా... ఆ పోల్స్ ఏవీ నిజం కావని బుద్ధా అన్నారు. లగడపాటి అంచనాలకు మించి టీడీపీ కీ సీట్లు వస్తాయని... 130సీట్లు గెలిచి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను తొడకొట్టి మరీ చెబుతున్నానని ఆయన అన్నారు.

2014 ఎన్నికల ముందు కూడా వైసీపీ నేతలు ఇంతకంటే ఎక్కువే ఊహల్లో తేలారని.. అప్పుడు ఎగ్జిట్ పోల్స్‌కి భిన్నంగా రాష్ట్రంలో ఫలితం వచ్చిందని ఆయన గుర్తుచేశారు. వైసీపీ ఓడిపోతుందని జగన్‌కు కూడా తెలుసన్నారు.

ఎగ్జిట్‌ పోల్స్‌పై తెలుగుదేశం శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. టీడీపీ గెలుపు ఖాయమని వివరించారు. జగన్‌తో కలిసి మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబే ప్రమాణం చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తారని ఆయన జోస్యం చెప్పారు.