విజయనగరం: తిరిగి అధికారంలోకి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గజకర్ణ గోకర్ణ విద్యలెన్నో ప్రయోగిస్తున్నారంటూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేని చేతకాని సీఎం చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

విజయనగరంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఐదేళ్లు అభివృద్ధిపై ప్రజలను ఓట్లు అడగకుండా కేసీఆర్ కు తాము మద్దతు ఇచ్చిన దానికి నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. 

దమ్ము, ధైర్యం ఉంటే ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఏం అభివృద్ధి చేశావో శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని సవాల్ విసిరారు. 

ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగవు నువ్వు అంటూ ధ్వజమెత్తారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తీసేసి అర్ధరాత్రి పారిపోయి వచ్చిన నువ్వా వైసీపీని విమర్శించేందంటూ ధ్వజమెత్తారు. నీ కేసుల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నావ్ అంటూ మండిపడ్డారు. 

అది పొడుస్తాను..ఇది పొడుస్తానని చెప్పి తీరా ఎన్నికలు వచ్చేసరికి విభజన హామీలపై చేతగాని దద్దమ్మ కబుర్లు చెబుతావా అంటూ మండిపడ్డారు. 
ఏపీకి విభజన హామీల సాధన పోరాటానికి తమ మద్దతు ప్రకటించిన కేసీఆర్ పై ఎందుకు అక్కసు అంటూ నిలదీశారు. 

యజ్ఞాలకు,యాగాలకు కెసిఆర్ ను తీసుకొచ్చి ఆయన నోటిలో సిగరెట్లు పెట్టింది మీరు కాదా అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీల మద్దతు కోరతామని స్పష్టం చేశారు. అందుకు ఏ పార్టీతోనైనా కలుస్తామని స్పష్టం చేశారు. మా మెుదటి ప్రాధాన్యత ప్రత్యేక హోదా సాధనేనని చెప్పుకొచ్చారు బొత్స. 

నువ్వు,నీ కొడుకు నల్ల చొక్కాలేసుకుంటేనే దీక్షలా అంటూ విమర్శించారు. నీవు మాటాడిన ప్రతి మాట వినడానికి ప్రజలేమీ అమాయకులు కాదని విమర్శించారు. నీ మోసాలు,వేషాలుతో  టీడీపీ తుడిచిపెట్టుకుపోనుందని జోస్యం చెప్పారు. 

విలువ పోయిందని తెలిసి జాతీయ నాయకులను తీసుకొస్తున్న చంద్రబాబు వారి విలువ తీస్తున్నారంటూ ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి ఎన్నికలు వచ్చేసరికి ముస్లిం, మైనారిటీలపై దొంగ నాటకాలాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు. 

నూటికి నూరు శాతం మా విధానాలు అమలు చేసేలా ముందుకు వెళ్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదాకు అంగీకరిస్తూ నువ్వు కేంద్రానికి స్వదస్తూరితో రాసిన లేఖను కేంద్రమంత్రి పియూష్ విడుదల చేశారని బొత్స తెలిపారు. 

ప్యాకేజీని అంగీకరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన లేఖను విడుదల చేశారని ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావ్ అంటూ విరుచుకుపడ్డారు. హైదరాబాదు నేనే కట్టానని, గత సీఎంలు ఏమీ చెయ్యలేదని సిగ్గులేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు పెట్టుబడులు ఎందుకు తేలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్, పోలవరం ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చెయ్యలేకపోయారో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.