విజయనగరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. తోలు తీస్తాను, తొక్క తీస్తానంటున్న పవన్ రాజకీయాలు అంటే ఏమనుకుంటున్నావ్ అంటూ విరుచుకుపడ్డారు. 

విజయనగరంలో ఆయన నివాసంలో మాట్లాడిన బొత్స అవతల వారికీ రోషం, పౌరుషం ఉంటాయని చెప్పుకొచ్చారు. నోరు ఉంది కదా అని వాగితే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. 

నీకు దమ్ము ధైర్యం ఉంటే టిడిపి తో కలిసి పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. 

రెండు రోజులు ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తే ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటున్నావా అంటూ నిలదీశారు. పవన్ గతంలో ప్రత్యక్షంగా, ఇవాళ పరోక్షంగా టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. 

దమ్ముంటే కలసి పోటీకి రావాలని సవాల్ విసిరారు. మీరు పెట్టిన పువ్వులు చాలు ఇక చాలించండంటూ సెటైర్లు వేశారు. మా నాయకుడు మాట్లాడే తీరును, మీ మాటల తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 


ఏపీని మోసం చేసిన ఏ పార్టీ అయినా మట్టికొట్టుకు పోవాల్సిందేనని బొత్స చెప్పుకొచ్చారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ లతో పాటు మరికొన్ని పార్టీలు ఒకే గూటికి చేరి పోటీ చేస్తున్నాయన్నారు. డ్రామాలెందుకు ముసుగు తీసి దమ్ముంటే పోటీకి రావాలని సవాల్ విసిరారు బొత్స సత్యనారాయణ.