గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర రాజధాని అమరావతిని రియల్ ఎస్టేట్ కేంద్రంగా చంద్రబాబు మార్చేశారని  జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. 

వందల కోట్ల సొమ్ము కొట్టేసి అదే అవినీతి డబ్బుతో మళ్లీ గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు ఏ గతి పట్టిందో ఇప్పుడు టీడీపీకి కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు జీవీఎల్. 

టీడీపీ ఇచ్చిన టీవీ యాడ్స్‌లో వచ్చేవన్నీ కేంద్ర పథకాలేనని రాష్ట్ర పథకాలేమీ అందులో లేవన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్రపథకాలుగా చెప్పుకుంటున్నందుకే చంద్రబాబు స్టిక్కర్ బాబు అని పిలుస్తున్నట్లు తెలిపారు. 

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లోకల్ కాదు కాబట్టే ఆ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ఏప్రిల్ 1న ప్రధాని నరేంద్ర మోదీ రాజమహేంద్రవరం బహిరంగ సభలో పాల్గొంటారని స్పష్టం చేశారు. 

మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏప్రిల్ 4న నరసరావుపేట, విశాఖపట్నం సభల్లో పాల్గొంటారని ప్రకటించారు. ఏప్రిల్ 4, 5న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నర్సాపురం, విజయనగరం సభలలో పాల్గొటారని స్పష్టం చేశారు. 

ఏప్రిల్ 5, 6న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. రాబోయే 10 రోజుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ కూడా ఏపీలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జీవీఎల్ స్పష్టం చేశారు.