రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఎంతో ఆగ్రహం ఉందని దాన్ని ఓట్లతో నిరూపించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును చొక్కా విప్పి కొట్టారంటే ప్రజలు టీడీపీ పాలన పట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. 

దేశంలో, రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఘన విజయం సాధించిన వైయస్ జగన్ కు అభినందనలు తెలిపారు. చంద్రబాబు ఒరిజినాలిటీ లేని నాయకుడని విరుచుకుపడ్డారు. 

జగన్ లో ఒరిజినాలిటీ ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపోతే రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోతుందని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. చంద్రబాబుకు ముప్పై సీట్లకంటే ఎక్కువ రానివ్వమని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. 

చంద్రబాబుతో పొత్తు కారణంగా రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలు నష్టపోయాయని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ అరాచకాలను ప్రజలు నాలుగేళ్లుగా గమనిస్తూ మౌనంగా ఉన్నారని సమయం రావడంతో తగిన గుణపాఠం చెప్పారని సోమువీర్రాజు అభిప్రాయ పడ్డారు.