ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి  నారా లోకేశ్ పై బిజెపి నాయకులు విష్ణవర్థన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆయన మంగళగిరి వంటి సేఫ్ స్థానం నుండి కాకుండా రాయలసీమ నుండి పోటీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలన్నారు. తమ్ముంటే వైఎస్సార్‌సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డితో ఈ ఎన్నికల్లో పోటీ పడి గెలిచి సీమ పౌరుషాన్ని చాటుకోవాలని సవాల్ విసిరారు. 

మంత్రి లోకేశ్ కేవలం ట్విట్టర్లో పోస్టులు పెట్టడం తప్ప మరేమీ చేయలేరని ఎద్దేవా చేశారు. ఆయన్ను ట్విట్టర్ పిట్టలదొరగా అభివర్ణించారు. తండ్రి అండతో దొడ్డిదారిలో మంత్రి పదవిని  పొందిన లోకేశ్ అదే దారిలో ఎమ్మెల్యేగా గెలవాలని చూస్తున్నారని అన్నారు. కావాలనే ఇతర స్థానాల్లో లోకేశ్ పోటీకి దిగుతాడని ప్రచారం చేసి  చివరకు మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారని అన్నారు. 

టిడిపి నాయకులు బిజెపి, వైఎస్సార్‌సిపి పార్టీల మధ్య రహస్య ఒప్పందం వున్నాయనడం విడ్డూరంగా వుందన్నారు. అది వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. జగన్ ను కాపాడాల్సిన అవసరంగానీ, మద్దతు పొందాల్సిన స్థితిలోగానీ బిజెపి పార్టీ లేదని విష్ణవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 

స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయంతో తమకు సంబంధమున్నట్లు చంద్రబాబు ఆరోపించడం తగదన్నారు. ఏపీ ఎన్నికలను మొదటి దశలో నిర్వహించడం తమ కుట్రేనని ఆరోపించడం ఆయనకే సిగ్గుచేటని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.