కామన్ పీపుల్ కేటగిరిలో బిగ్ బాస్ 2 లో అడుగుపెట్టింది సంజన. మిస్ హైదరాబాద్ టైటిల్ విన్నర్ అయిన సంజన.. అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. అయితే.. వాటిల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కాగా.. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అవుదామని ప్రయత్నించింది. అయితే.. అక్కడ కూడా బెడసి కొట్టింది. మొదటి వారంలోనే ఆమె బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు అడుగుపెట్టింది.

కాగా ఇప్పుడు ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నూజివీడు అసెంబ్లీ బరి నుంచి ఆమె పోటీకి సై అంటున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ కూడా వేశారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన సాయిసంజన అసలు పేరు అన్నే వనజ. ఆమె తండ్రి అన్నే ధనకోటేశ్వరరావు ప్రముఖ రైతు.
 
అన్నే వనజ 2016లో మిస్‌ హైదరాబాద్‌గా ఎంపికయ్యారు. ఆమె హైదరాబాద్‌ సినీపరిశ్రమకు వెళ్లాక జనజాగృతి పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నూజివీడు అభ్యర్థిగా పోటీచేసేందుకు ప్రయత్నించారు. టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నూజివీడు అసెంబ్లీ బరిలో పోటీచేస్తున్నారు. ఆమె దివంగత మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు సమీప బంధువు.