ఐపీఎల్ సీజన్ మొదలయ్యిందంటే చాలు.. ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారు..? ఏ టీం కప్పు గెలుస్తుంది..? ఏ క్రికెటర్ ఎంత కొడతాడు ఇలా రకరకాలు బెట్టింగులు కాస్తుంటారు. బెట్టింగ్ రాయుళ్లకు ఐపీఎల్ మంచి బిజినెస్. గెలిచిన వాళ్లు లక్షలు సంపాదించుకంటే.. ఓడిన వాళ్లు దివాలా తీస్తుంటారు. అయితే ఇప్పుడు ఐపీఎల్ తో సమానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బెట్టింగులు కాస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నడుస్తుండగా.. ఏపీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి ఉంది. మళ్లీ  చంద్రబాబు అధికారంలోకి వస్తారా? జగన్ కి తొలిసారిగా పట్టం కడతారా? లేక పవన్ సీఎం అవుతారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుకే వీటిపై బెట్టింగులు కాస్తున్నారు జనాలు.

ముఖ్యంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరం నియోజకవర్గాల గురించి బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. భీమవరంలో పవన్ ఓడిపోతాడని బెట్టింగ్ రాయుళ్లు ఛాలెంజ్ చేస్తున్నారు. ప‌వ‌న్ భీమ‌వ‌రంలో ఓడిపోతాడ‌ని కోట్లలో పందేలకు దిగుతున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువయినప్పటికీ.. జనసేనాని ఓడిపోతాడని బెట్టింగ్ రాయుళ్లు బలంగా నమ్ముతున్నారు. జనసేనాని గెలిస్తే.. మీకు లక్ష రూపాయలు ఇస్తాం. ఓడితే రూ.3 లక్షలు ఇవ్వండని బెట్టింగులకు దిగుతున్నారట.