ఏపీలో ఎన్నికలకు పోలింగ్ గురువారంతో ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉండటంతో.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని అలసిపోయిన నేతలంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

కాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం.. తన అల్లుల్ల గెలుపు పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై ఆరా తీశారు. శుక్రవారం హిందూపురంలోని ,చౌడేశ్వరీ కాలనీలోని  తన  స్వగృహంలో తెల్లవారుజామున 4గంటలకు నిద్రలేచిన ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొని యోగా, జిమ్‌ చేశారు. 7గంటల నుంచి టీడీపీ నియోజకవర్గ నాయకులను పిలిపించుకుని పోలింగ్‌ సరళిపై ఆరా తీశారు. 

మండల స్థాయి నాయకులతో ఫోన్‌లో మాట్లాడి పోలింగ్‌ సరళిని తెలుసుకున్నారు. తన బంధువులతో చర్చించారు. బాలయ్య పెద్దల్లుడు లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా.. చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

దీంతో బాలయ్య మంగళగిరి, వైజాగ్‌లో పోలింగ్‌ సరళిపై ఆరాతీశారు. రాష్ట్రస్థాయి నాయకులతో ఎన్నికల ట్రెండ్‌ను తెలుసుకున్నారు. గంటా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.