కడప: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీలో వింత పరిస్థితి నెలకొంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు నిరాకరిస్తుంటే..మరికొందరు నామినేషన్ వేసి నా వల్లకాదంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి. 

ఇటీవలే శ్రీశైలం అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏకంగా తాను రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నానని ప్రకటించగా, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం నామినేషన్ వేసేందుకు కూడా వెనకడుగు వేశారు. 

అయితే తాజాగా కడప జిల్లా బద్వేల్ నియోజకర్గం టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ నామినేషన్ దాఖలు చేసి తాను బరిలో నిలవలేనని కుండ బద్దలు కొట్టారు. దీంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. బద్వేల్‌ నియోజకవర్గం టీడీపీ తరఫున బరిలోకి దిగారు డాక్టర్‌ రాజశేఖర్‌. 

మరోవైపు శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. టీడీపీ నుంచి విజయజ్యోతి రెబల్ అభ్యర్థిగా పోటీ చెయ్యడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంంతో పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 

ఇకపోతే టీడీపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ విజయజ్యోతి శుక్రవారం టీడీపీ రెబల్‌గా నామినేషన్‌ వేశారు. దీంతో విజయజ్యోతి ఇక టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం బద్వేల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈలోగా రాజశేఖర్ ఇలా హ్యాండ్ ఇవ్వడంతో పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.