ఈ ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. తమ పార్టీ గెలుపు ఖాయమని.. చంద్రబాబు సీఎం అవ్వడం కూడా ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆశీర్వదించారని... టీడీపీ గెలుపు పక్కాని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వచ్చిన అయ్యన్నపాత్రుడు.. మీడియాతో మాట్లాడారు.

ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని.. వైసీపీ నేతల ఓటమి ఖాయమని చెప్పారు. ఓడిపోతామని తెలిసినా కూడా వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పసుపు-కుంకుమ, పింఛన్లు తమకు కలిసొచ్చే అంశాలని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం వచ్చే నెల 23న విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో.. అభ్యర్థులంతా టెన్షన్  లో మునిగి ఉన్నారు. ఓటరు నిర్ణయం ఎలా ఉందో తెలియాలంటే మాత్రం నెల రోజులు ఆగాల్సిందే.