హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపటి నుండి నామినేషన్లను పరిశీలించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కీలక అభ్యర్థులు సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.  ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహణకు గాను ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్లను రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు విడుదల చేశారు.

ఈ నెల 18వ తేదీ నుండి ఇవాళ్టి వరకు నామినేషన్లను స్వీకరించారు. ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి, 25 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి.

ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు సుమారు 1800 నామినేషన్లు దాఖలైనట్టుగా సమాచారం అందుతోంది.  25 పార్లమెంట్ స్థానాలకు సుమారు 320 నామినేషన్లు దాఖలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న కీలక అభ్యర్థులు సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు.

సికింద్రాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్, కిషన్ రెడ్డి, హైద్రాబాద్ నుండి భగవంతరావు, ఖమ్మం నుండి నామా నాగేశ్వరరావు, రేణుకా చౌదరి, భువనగిరి నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , బూర నర్సయ్య గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు. 

మల్కాజిగిరి నుండి రేవంత్ రెడ్డి,  నల్గొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  పసుపు, ఎర్ర జొన్న రైతులు తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. 

ఇవాళ సాయంత్రం తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్  మీడియా సమావేశంలో  నామినేషన్ల గురించి వివరాలను ప్రకటించనున్నారు.ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలించనున్నారు. ఈ నెల 28వ తేదీన నామినేషన్లను ఉపసంహరించుకొనేందుకు చివరితేది.