విజయవాడ: బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్థానిక నాయకులు షాక్ ఇస్తున్నారు. జనసేన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి స్థానిక నాయకులు ఇష్టపడడం లేదు. తాము అడిగిన సీట్లు ఇవ్వలేదని వారు ఆగ్రహంతో ఉన్నారు. 

చాలా లోకసభ, శాసనసభ నియోజకవర్గాల్లో జనసేనకు డిపాజిట్లు కూడా రావని దుమ్మెత్తి పోస్తున్నారు. బిఎస్పీకి జనసేన 21 సీట్లు కేటాయించింది. అయితే, తాము అడిగిన సీట్లు కాకుండా వేరే సీట్లు కేటాయించారని అంటున్నారు. 

తమ అధినేత్రి మాయావతిపై కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు. పొత్తు విషయంలో తమను సంప్రదించుకపోవడాన్ని వారు తప్పు పడుతున్నారు. కొవ్వూరు, పాడేరు వంటి సీట్లను, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని సీట్లను బిఎస్పీ నేతలు అడిగారు. తమకు తగిన బలం ఉందని భావించిన సీట్లను వారు ఆశించారు. అయితే, వాటిని జనసేన బిఎస్పీకి కేటాయించలేదు. 

బిఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త భీర్ సింగ్ గురువారంనాడు అమరావతిలో కొంత మంది నాయకులతో సమావేశమయ్యారు. జనసేన తమకు బలం ఉన్న సీట్లను కేటాయించే విధంగా చర్యలు తీసుకుని నేతలు భీర్ సింగ్ పై ఒత్తిడి తెచ్చారు. లేదంటే తాము తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తామని కూడా హెచ్చరించారు.