అనంతపురం: అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేందుకు ఆమె విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. నిన్న, మెున్నటి వరకు రెండు సీట్లు కావాలంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చిన అనిత అనూహ్యంగా తాను ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని ప్రకటిస్తూ చంద్రబాబు నాయుడుకు ట్విస్ట్ ఇచ్చారు. 

టీడీపీలోని నేతలంతా చంద్రబాబు నాయుడు వద్ద తేల్చుకుని ప్రచారం చేస్తుంటే పరిటాల సునీత మాత్రం బుధవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించి తన కుమారుడుని ఆశీర్వదించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తనను ఇప్పటి వరకు ఆదరించారని అలాగే తన తనయుడు శ్రీరామ్ ను కూడా ఆశీర్వదించి అండగా ఉండాలంటూ కార్యకర్తలను కోరారు. తమ కుటుంబం, పరిటాల అభిమానుల ఆకాంక్ష మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధినేతకు చెప్పామని ఆమె తెలిపారు. 

తమ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించాలని చంద్రబాబును కోరామని అలా వీలుకాని పక్షంలో రాప్తాడు నుంచి శ్రీరామ్‌ బరిలో ఉంటారని సునీత స్పష్టం చేశారు. మంత్రి పరిటాల సునీత వ్యవహారం ఇప్పుడు అనంతపురం రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే రాప్తాడు టీడీపీ అభ్యర్థిగా మంత్రి పరిటాల సునీతను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. 

అయితే మంత్రి తన తనయుడు బరిలో ఉంటారంటూ ఎన్నికల ప్రచారం చేపట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీటుపై తేల్చుకునేందుకు గురువారం సీఎం చంద్రబాబు నాయుడును మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ తో కలిసి ఉండవల్లిలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సునీత అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడం తనయుడు శ్రీరామ్ ను బరిలోకి దించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని ప్రచారం జరుగుతోంది.