అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. శాసనసభ అభ్యర్థిగా తాను పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్న నారా లోకేష్ ఇవేవీ ప్రజా సేవకు ఆటంకం కావన్నారు. ఇకముందుకు కూడా ప్రజల్లో ఉంటాను, ప్రజల కోసం పనిచేస్తానంటూ ట్వీట్ చేశారు. ఇకపోతే నారా లోకేష్ తొలిసారిగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 

మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు నారా లోకేష్. ఏపీ మంత్రి, సీఎం తనయుడు కావడంతో నారా లోకేష్ గెలుపు నల్లేరుపై నడకేనని టీడీపీ భావించింది. 

అయితే అనూహ్యరీతిలో తన సమీప ప్రత్యర్థి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నారా లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి 5వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.