అమరావతి: తన రాజకీయ భవిష్యత్ పై మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని కొనసాగుతానని స్పష్టం చేశారు. 

తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. గతంలోనే తాను పార్టీ మారే విషయంపై స్పష్టం చేసినట్లు తెలిపారు. తాను పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానే తప్ప పార్టీ మారనన్నారు. 

ఇకపోతే రూ.17 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం ప్రారంభమైందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లలో ఎదురైన ప్రతి సంక్షోభాన్ని సీఎం చంద్రబాబు ఒక సవాలుగా స్వీకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారని స్పష్టం చేశారు. 

రూపాయి చెల్లించకుండా రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు సేకరించిన గొప్ప నేత చంద్రబాబు నాయుడు అంటూ చెప్పుకొచ్చారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం మైండ్‌గేమ్‌ ఆడుతోందని ఆరోపించారు. 

ఒక నీతి, నియమం, విలువల్లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. తాను జగన్‌తో భేటీ అయినట్లు.. ముహూర్తం కూడా ఖరారైనట్లు వార్తలు ప్రసారం చేస్తున్నారని అదంతా మీడియా సృష్టేనని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ హితవు పలికారు మంత్రి గంటా శ్రీనివాసరావు.