అమరావతి: ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. వైయస్ జగన్ సీఎం అయ్యేవరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ నరసింహన్ చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన సేవలను గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ఐదేళ్లపాటు పరిపాలన అందించినందుకు గవర్నర్ నరసింహన్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చంద్రబాబు రాజీనామాను ఆమోదిస్తున్నట్లు గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. 

ఇకపోతే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. దాదాపు 150కు పైగా స్థానాల్లో విజయం దిశగా పయనిస్తోంది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్తానాలకే పరిమితమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, వైయస్ జగన్ సీఎం కావడంఖాయమై పోయింది. 

అంతేకాదు ఈనెల 25న వైయస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై శాసనసభ పక్ష నేతగా జగన్ ను ఎన్నుకోనున్నారు. 

అనంతరం ఈనెల 30న వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి గవర్నర్ కార్యాలయ వర్గాలు, సీఎస్ లతో ఇప్పటికే జగన్ చర్చించారు.