ఢిల్లీ: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ డీజీపీని కలవాలని ఆదేశించింది. 

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఢిల్లీ బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి బెంచ్ తో ఠాకూర్ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగిన కొద్ది రోజుల్లోనే ఏపీ డీజీపీకి పిలుపురావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇకపోతే ఏపీ డీజీపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహారిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఏపీ డీజీపీ కాన్వాయ్ లోనే కోట్లాది రూపాయలు తరలించారని సాక్ష్యాలతో సహా ఆధారాలు అందజేశారు. 

మరోవైపు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పలు కీలక విషయాలపై సమాచారం సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డికి ఎందుకు రక్షణ కల్పించలేకపోయారని అనే అంశంపై వివరణ కోరనుందని తెలుస్తోంది. 

దీంతోపాటు ఏపీలోని పోలీసు పదోన్నతులపై కూడా విచారించనున్నట్లు సమాచారం. అలాగే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై కత్తితో దాడి జరిగితే వెంటనే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే అంశాలపై వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది. మెుత్తానికి ఏపీ డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.