గ్రామాలు ,పట్టణాల్లో ఉచితంగా ఇళ్లను నిర్మిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో సోమవారం ఉదయం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ..  రేపటి ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు.

వైసీపీకి ఓటేస్తే పెన్షన్లు ఆగిపోతాయని, ఏపీని దెబ్బతీయడమే కేసీఆర్ కుతంత్రమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కాకూడదనేదే కేసీఆర్ కోరికని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ టీఆర్ఎస్‌లను పవన్ తిడుతున్నారని కానీ జగన్ మాత్రం కేసీఆర్, మోడీని ఒక్క మాట కూడా అనడం లేదని విమర్శించారు.

వైసీపీ నుంచి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే గెలిచినా కేసీఆర్‌కే లాభమని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లను వేధిస్తే సహించేది లేదని ఆస్తులున్న వారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

మన ఆస్తులు లాక్కునే వరకు కేసీఆర్‌కు తృప్తి లేదని విమర్శించారు. జగన్ ఏపీకి పెను విపత్తుగా మారారని,  తుఫాన్లు, కరువు సమస్యకన్నా రాష్ట్రానికి జగనే పెద్ద సమస్యగా మారారని సీఎం ఆరోపించారు. దాడులు, దౌర్జన్యాలే వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో అని బాబు ఎద్దేవా చేశారు.