ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. విజయనగరంలో ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్న సీఎం... కార్యకర్తుల, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఒకప్పుడు నా దగ్గర పనిచేసిన కేసీఆర్.. తన మీద దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు మంత్రి పదవి ఇవ్వలేదని కేసీఆర్ పార్టీకి రాజీనామా చేశారని బాబు గుర్తు చేశారు. ముగ్గురు మోడీలు ఒక్కటయ్యారని హైదరాబాద్‌లో స్విచ్చ్ వేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుందని , కరెంట్ సప్లై ఢిల్లీలో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

హిందుజా వ్యవహారంలో జగన్ అతి తెలివి బయటపడిందని బాబు అన్నారు. 65 లక్షలకు సంబంధించిన డేటాను కేసీఆర్ దొంగిలించి, జగన్‌కు ఇచ్చారని సీఎం అన్నారు. ప్రశాంత్ కిశోరే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం, కార్యకర్తలతో మాట్లాడటం చేస్తారని.. మరి జగన్ ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

పాదయాత్రలో జగన్ ఫ్యాషన్ వాక్ చేశారని, రెండు గంటలు తిరిగితే.. నాలుగు గంటలు రెస్ట్ తీసుకుంటారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ఓట్లు తీసేయ్యాలని జగన్‌కు ప్రశాంత్ కిశోర్‌ సలహా ఇచ్చారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

ప్రత్యేక హోదా కోసం అశోక్‌ గజపతి రాజు కేంద్ర మంత్రి పదవికి ఐదు నిమిషాల్లో రాజీనామా చేశారని సీఎం గుర్తు చేశారు. హోదాపైనా, కేంద్రం అన్యాయంపైనా గల్లా జయదేవ్ పార్లమెంట్‌‌‌లో ఉండగానే ఈడీ నోటీసులు పంపారన్నారు.