అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరిగిందన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన అమరావతిలో పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకుని గెలుపు గుర్రాలనే ఎంపిక చేశామన్నారు. టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలని చంద్రబాబు కోరారు. దొంగ సర్వేలతో ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా, కుట్రలు పన్నినా తెలుగుదేశం గెలుపును ఎవరూ ఆపలేరని బాబు చెప్పారు.

జనంలో పార్టీ పట్ల ఉన్న సానుకూలతను ఎవరూ తగ్గించలేరని స్పష్టం చేశారు. సైకిల్ గుర్తుకే ఓటేయాలని పథకాల లబ్ధిదారులు కసితో ఉన్నారని, దీంతో ప్రతిపక్షానికి ఓటమి భయం వెంటాడుతోందన్నారు. దిక్కు తోచని స్థితిలో పడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంతటి అరాచకాలకైనా రెడీగా ఉందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు.